- వ్యవస్థలపై నమ్మకం పోగొట్టేలా రాహుల్, ప్రకాశ్‌రాజ్ కుట్రలు
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఫైర్
హైదరాబాద్, వెలుగు: వరుస పరాజయాలు, ఓటమి భయంతోనే కాంగ్రెస్ రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై విష ప్రచారం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో వరుసగా మూడుసార్లు మోదీని ప్రధానిగా ప్రజలు ఆశీర్వదిస్తే హస్తం పార్టీ జీర్ణించుకోలేకపోతోందన్నారు. ఆదివారం నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడారు. ప్రధాని పీఠం కేవలం నెహ్రూ, గాంధీ కుటుంబానికే సొంతమనే రాచరికపు అహంకారంలో కాంగ్రెస్ నేతలు బతుకుతున్నారని ఫైర్అయ్యారు.
దేశంలో జరిగిన ఎన్నికలన్నీ బూటకమని, వాటిని రద్దు చేయాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అనడం ప్రజాస్వామ్యాన్ని, ఓటేసిన కోట్ల మంది ప్రజల విచక్షణను అవమానించడమేనని అన్నారు. రాహుల్ గాంధీ, ప్రకాశ్ రాజ్ లాంటి శక్తులు ఏకమై సుప్రీంకోర్టు, రాష్ట్రపతి భవన్, ఎన్నికల సంఘంపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు. వ్యవస్థలను బలహీనపరిచి దేశ సమగ్రతకు భంగం కలిగించాలని చూస్తున్నారని ఆరోపించారు.
ఫామ్–7 పెడితే ఓట్లు పోవు
సర్ ప్రక్రియపై కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తోందని రాంచందర్‌రావు మండిపడ్డారు. నిబంధనల ప్రకారం దొంగ ఓట్లు, నకిలీ ఓట్ల తొలగింపు కోసమే ఫామ్–7 విధానం ఉందనీ, ఎవరైనా ఫామ్–7 దరఖాస్తు ఇస్తే నేరుగా ఓట్లు తీసేయబోరని చెప్పారు. ఈసీ క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటుందనీ, బీజేపీ బీఎల్ఏలు ఎవరూ అలాంటి దరఖాస్తులు ఇవ్వలేదన్నారు. ఎక్కడైనా ఎన్నికల్లో గెలిస్తే వ్యవస్థలు బాగున్నాయని.. అదే ఓడిపోతే ఈవీఎంలు, ఎస్ఐఆర్ ప్రక్రియలపై నెపం మోపడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని సెటైర్వేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ముక్త్ భారత్ ఏర్పడిందని, మిగిలిన రెండు మూడు రాష్ట్రాల్లోనూ ప్రజలు ఆ పార్టీని తరిమికొట్టడం ఖాయమని జోస్యం చెప్పారు.
